మెదక్, సెప్టెంబర్ 27 (తెలుగు ట్రెండ్స్):
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీతో మెదక్ సంస్కృతి, కళా వైభోగం ప్రతిబింబించింది. సుమారు 4 వేల మందితో నిర్వహించిన ఈ ర్యాలీలో 16 రకాల కళారూపాలు, సంప్రదాయ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెదక్ ఖిల్లాపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మెదక్ ఖిల్లా సందర్శనార్థం ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.
ర్యాలీలో డప్పు, డోలు, తంబుర, చిందు, భాగవతం, బోనాలు, బతుకమ్మ, గిరిజన లంబాడి కళారూపాలు, గీత కార్మికులు, కరాటే, ఎన్సీసీ విద్యార్థులు, ఒగ్గు కళాకారులు తదితరులు సంప్రదాయ వేషధారణలో పాల్గొన్నారు. కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థుల కవాతుతో ర్యాలీ ఆద్యంతం సందడిగా సాగింది.
అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగంపై రూపొందించిన ఏవీని ప్రదర్శించారు. శాంతి సందేశానికి సూచికగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజు తెల్లటి పావురాలను ఎగురవేశారు. అనంతరం మెదక్ పర్యాటక రంగానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్‌ను ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్‌కు ఉందని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో మెదక్ జిల్లాను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు.
పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, మెదక్ చర్చి తదితర పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని పరిరక్షించాలని, ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వస్తువులను వినియోగించాలని కోరారు. పర్యాటక అభివృద్ధితో హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రాంతాల్లో పెరిగే వాహనాల రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపద ఎంతో ఉందని తెలిపారు. ఈ సంపదను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మెదక్ జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు 14 ప్రదేశాలను గుర్తించామని, వాటికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అనేక చారిత్రక, వారసత్వ సంపదలు ఉండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు మెదక్‌ను సందర్శించేలా ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థి చదివిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీపీఆర్వో రామచంద్ర రాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్, మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












