తూప్రాన్, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్):
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన చెట్లలో మూడు చెట్లను అక్రమంగా నరికివేసినందుకు పట్టణానికి చెందిన జమాల్పూర్ రామ్కు రూ.10 వేల జరిమానా విధించారు.
మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో కీలకమని తెలిపారు. మున్సిపల్ అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
మున్సిపల్ చట్టం ప్రకారం చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు చెట్లను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.
– తూప్రాన్ మున్సిపాలిటీ తెలుగు ట్రేండ్స్ న్యూస్

