బాల్య వివాహ రహిత గ్రామంగా ఎల్కపల్లిని తీర్చిదిద్దుతాం
చిన్న వయసులో పెళ్లితో చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుకు తీవ్ర నష్టం
వెల్దుర్తి మండలం, అక్టోబర్ 2 (తెలుగు ట్రెండ్స్): బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసి ఆడపిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడేందుకు ఎల్కపల్లి గ్రామస్తులు సంకల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, ఎల్కపల్లిని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని శివలింగం, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు వారి భవిష్యత్ అవకాశాలు దెబ్బతింటాయని వివరించారు. అలాగే బాల్య వివాహాలు బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి బాల్య వివాహాలు చేయవద్దని గ్రామస్తులకు సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. బాల్య వివాహాల నిర్మూలనలో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు సమష్టిగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి ఎల్కపల్లిని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశా
రు.

