మెదక్ జిల్లా, అక్టోబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టడం బాధాకరమని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసి, అర్హులైన ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడంతో పాటు, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన భారత పౌరులకు ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు నమోదై ఉంటే, నిబంధనల ప్రకారం డూప్లికేట్ నమోదులను తొలగించి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటారని వివరించారు.
దేశంలో గతంలోనూ ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్ కూడా ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించేందుకు ఉద్దేశించిన ప్రక్రియగా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని గడ్డం శ్రీనివాస్ అన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మరణించిన వారి పేర్లు, నిబంధనలకు విరుద్ధంగా నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి సరిచేయడం అవసరమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.
