అమిత్ షా పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బ్రాహ్మణపల్లిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ మెదక్, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ గురువారం బ్రాహ్మణపల్లిలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమూల్ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్, వీవీఐపీ కాన్వాయ్ రూట్ తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులతో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి పర్యటన సజావుగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐలు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, అమూల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

