ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌పై ఆరోపణలు మానుకోవాలి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జె. మల్లారెడ్డి
తెలుగు ట్రెండ్స్ న్యూస్, చిన్నశంకరంపేట, అక్టోబర్ 17:
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మెదక్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి జె. మల్లారెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
శనివారం చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జె. మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఎన్నికల ప్రక్రియపై అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తూ, ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్న వారు, ఏ గ్రామంలోనైనా, ఏ బూత్ స్థాయిలోనైనా తొలగించిన ఓట్ల వివరాలను ఆధారాలతో చూపించాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొత్తదేమీ కాదని, 2002లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రక్రియ జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు దాత్రిక నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ న్యూస్
