పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలి
మెదక్, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లాలో పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పోలీసు ఉద్యోగ అభ్యర్థి సాయి సమ్మర్ కోరారు. జిల్లాలోని నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు యువత ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేక హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శిక్షణ కేంద్రాలకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా సాయి సమ్మర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతకు రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా శిక్షణ అవసరమని అన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతకు ఉచిత శిక్షణ అందిస్తే పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు.
మెదక్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించి జిల్లాలో ఉచిత పోలీసు ఉద్యోగ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శిక్షణ కేంద్రాల ద్వారా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలకు కోచింగ్తో పాటు ఫిజికల్ టెస్టులకు అవసరమైన శిక్షణ కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జిల్లాలోని నిరుపేద, గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా ఉచిత కోచింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కో
రారు.
