గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అధికారుల సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లాలో అక్టోబర్ 6న నిర్వహించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అక్టోబర్ 6న జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా రామాయంపేట–సిద్దిపేట మధ్య జాతీయ రహదారి NH-765DG వెంట 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే భారీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని రామాయంపేటలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి వెంట ఒకేసారి ఇంత భారీ స్థాయిలో జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి వెంట అందుబాటులో ఉన్న భూమిని ఉత్పాదకంగా వినియోగించడంతో పాటు పచ్చదనం, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. గవర్నర్ మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి చేరుకుని 2.40 గంటలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ‘నషా ముక్త్ భారత్’ ర్యాలీని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని, 2.50 గంటలకు ఐడీఓసీలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన భారతీయ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ నుంచి రామాయంపేటకు బయలుదేరి, 3.30 గంటలకు అమోఘ్ హోటల్ సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఐడీఓసీలో గవర్నర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇతర అధికారులు పరిశీలించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి జో జి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంక్షేమ అధికారి హేమా భార్గవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా
రు.
