బ్రాహ్మణపల్లిలో అమూల్ పాల పరిశ్రమ.. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి
అతిపెద్ద పాల పరిశ్రమ ఏర్పాటుతో పాడి రంగానికి ఊతం.. ఎంపీ రఘునందన్‌రావు
నర్సాపూర్, అక్టోబర్ 2 (తెలుగు ట్రెండ్స్): మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త ఉందని, రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు పాడి రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అతిపెద్ద అమూల్ పాల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్‌గౌడ్, యువమోర్చా ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నర్సాపూర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానం చేసిన యువతతో పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7న సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 4న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ పాల సంస్థను ప్రారంభించనున్నట్లు ఎంపీ ప్రకటించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పరిసర ప్రాంత రైతులకు పాడి రంగం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముర్రా జాతి గేదెల కొనుగోలుకు బ్యాంకులు, అమూల్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా పాల ఉత్పత్తిని పెంచి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. అమూల్ పరిశ్రమ ద్వారా సుమారు 200 మందికి శాశ్వత ఉద్యోగాలు, మరో 200 మందికి క్యాజువల్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి, పంటలకు ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 20 వేల మంది రైతులను సభ్యులుగా చేర్చుకున్నామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్ష మందికి చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రఘునందన్‌రావు తెలిపారు. పరిసర ప్రాంత రైతులు పాడి పరిశ్రమలు, డైరీ ఫారాల వైపు మొగ్గు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పాడి రంగం ద్వారా స్థిరమైన అదనపు ఆదాయ మార్గాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ప్రజలకు అండగా ఉంటానని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి నరసింహారెడ్డి, నాయకులు ఆంజనేయులు గౌడ్, ప్రేమ్‌కుమార్, సురేష్, రమేష్‌గౌడ్, రాణి తదితరులు పాల్గొన్నా
రు.

