మెదక్ బతుకమ్మ చౌక్లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు
మెదక్, అక్టోబర్ 17 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని శ్రీ నల్లపోచమ్మ కాలనీ బతుకమ్మ చౌక్ ప్రధాన కూడలిలో అట్ల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ మహాసంబరాలు కన్నులపండువగా సాగాయి.
రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఉత్సాహభరితమైన ఆటపాటలు, ఉయ్యాల పాటలు, కోలాటాలతో బతుకమ్మ చౌక్ పూలవనాన్ని తలపించింది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతి సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి.
కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రాంగణమంతా పండుగ శోభను నింపాయి. మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

