Type Here to Get Search Results !

నశాముక్త భారత్‌కు ప్రజా భాగస్వామ్యం కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

 





నశాముక్త భారత్‌–టీబీ ముక్త భారత్‌కు ప్రజా భాగస్వామ్యం కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

మెదక్, అక్టోబర్ 6 (తెలుగు ట్రెండ్స్): సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ డ్రగ్స్‌, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడబోమని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ ఐడీఓసీలో నిర్వహించిన నశాముక్త భారత్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని నశాముక్తి ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని నశాముక్తంగా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ దేశాల్లో ఒకటని, యువశక్తి మత్తు పదార్థాల బారిన పడితే దేశ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘జీవితానికి అవును.. నషాకు నో’’ అన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నశాముక్తి ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, కుటుంబం నుంచి పాఠశాల, గ్రామం, మండలం, జిల్లా స్థాయికి అవగాహన విస్తరించాలని పిలుపునిచ్చారు.

టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం

నశాముక్త భారత్‌తో పాటు టీబీ ముక్త భారత్ లక్ష్య సాధనకు కూడా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యుల సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే టీబీ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని చెప్పారు. నశాముక్తి, టీబీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పాఠశాలల్లో విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తిస్తే మౌనంగా ఉండకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై అవగాహన కలిగి ఉండి, మత్తు పదార్థాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

నశాముక్త మెదక్ దిశగా సమష్టిగా కదలాలి

నశాముక్తి ఒక్కరి బాధ్యత కాదని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని గవర్నర్ స్పష్టం చేశారు. అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు సమష్టిగా కృషి చేసినప్పుడే మెదక్‌ను నశాముక్త జిల్లాగా తీర్చిదిద్దగలమన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలు కనిపిస్తే పోలీసు, పౌర పరిపాలన సమన్వయంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రూపొందించే కార్యాచరణకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నశాముక్త మెదక్, టీబీ ముక్త మెదక్‌గా తీర్చిదిద్దడంతో పాటు ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, శక్తిమంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సమర్థవంతమైన చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు తెలంగాణ పోలీసులకు దేశంలోనే తొలి ట్రోఫీ లభించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులను అభినందించారు. జూన్‌లో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతరుల సమక్షంలో వేలాది మంది విద్యార్థులతో నశాముక్తి సంకల్పం చేయించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. ఆ సంకల్పాన్ని ఒక కార్యక్రమానికే పరిమితం చేయకుండా ప్రతి పాఠశాల, గ్రామం, కుటుంబానికి తీసుకెళ్లాలని సూచించారు.

2029 నాటికి నశాముక్త తెలంగాణ లక్ష్యం

2029 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా నిలపాలని గవర్నర్ ఆకాంక్షించారు. హిమాచల్‌ప్రదేశ్ తరహాలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నశాముక్తిపై అవగాహన తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ 2029 నాటికి మత్తు పదార్థాలు లేని భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

ప్రతి నెల కనీసం ఒక పాఠశాలలో యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ సూచించారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడుతున్న విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి, ప్రారంభ దశలోనే వారిని వాటికి దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులతో నశాముక్తి ప్రతిజ్ఞ చేయించాలని పిలుపునిచ్చారు.

సెల్ఫీ పాయింట్, మహిళా శక్తి స్టాళ్ల సందర్శన

కార్యక్రమానికి ముందు నశాముక్త్ భారత్ సెల్ఫీ పాయింట్ వద్ద గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ నశాముక్త్ మెదక్, నశాముక్త్ తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం

నశాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెదక్ ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language