వనదుర్గామాతను దర్శించుకున్న టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ
పాపన్నపేట, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాతను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ వి. జితేష్ పాటిల్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మండల పరిధిలోని యూసుఫ్పేటలో రైతులతో సీఎండీ మాట్లాడారు. రైతులు వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆరుతడి పంటల ద్వారా ఎకరాకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం మిన్పూర్ 220 కేవీ సబ్స్టేషన్లోని నార్సింగి ఫీడర్ను పరిశీలించారు. ఫీడర్పై లోడ్ సామర్థ్యం అధికంగా ఉందని ఎస్ఈ నారాయణ నాయక్, డీఈ రామేశ్వరస్వామి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎండీ అవసరమైన పనులకు ఎస్టిమేషన్ రూపొందించి పంపించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సీఎండీ వి. జితేష్ పాటిల్, సీజీఎం బాలస్వామి మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెదక్ సర్కిల్ ఎస్ఈ నారాయణ నాయక్, డీఈ రామేశ్వరస్వామి, మెదక్, పాపన్నపేట ఏడీఈలు వెంకటేశ్వర్లు, మోహన్ బాబు, విద్యుత్ యూనియన్ నాయకులు, పాపన్నపేట, టేక్మాల్ విద్యుత్ ఏఈలు నర్సింలు, ఉదయ్ భాస్కర్, లైన్ ఇన్స్పెక్టర్ టేక్మాల్ సంగయ్య, మిన్పూర్ ఆపరేటర్లు సంపత్, పాపయ్యోల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

