అందోల్ రైతుల మహా ధర్నాకు భారీ స్పందన
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్
తెలుగు ట్రెండ్స్ | అందోల్, అక్టోబర్ 13: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన రైతన్న మహా ధర్నాకు భారీ స్పందన లభించింది. అందోల్ మండలం అన్నసాగర్ సబ్స్టేషన్ ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ధర్నా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.
విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జోగిపేట ట్రాన్స్కో డీఈ ధర్నా స్థలానికి చేరుకుని రైతుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను ఆయనకు వివరించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యల కారణంగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సక్రమంగా అందించడంతో పాటు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
రైతులు అధైర్యపడవద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని క్రాంతి కిరణ్ సూచించారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ సమస్యల కారణంగా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, రైతులు
ఈ రైతన్న మహా ధర్నా కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి. జైపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్, మాజీ జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పి. నారాయణ ముదిరాజ్, డి.బి. నాగభూషణం, అందోల్ మాజీ ఎంపీపీలు జి. అర్జునయ్య, జె. బాలయ్య, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, లింగాగౌడ్, చాపల వెంకటేశం, జగన్ మోహన్ రెడ్డి, ఎ. శంకరయ్య, అన్నసాగర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అలాగే సర్పంచులు వసంత్ రెడ్డి, హరినారాయణ వర్మ, సత్యం, సాయి కుమార్, అనిల్ రెడ్డి, నాయకులు మాణిక్ రెడ్డి, బిర్ల శంకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, ఖాజా పాషా, ఉస నాగరాజు, నాయికోటి అశోక్, ఆకుల శంకర్, ఉల్వల వెంకటేశం, అరె సురేష్, కరుణాకర్, మొగులయ్య, కమలమ్మ, మన్నె పరిపూర్ణ, ఆగమయ్య, మన్నె మారుతి, లక్ష్మీనారాయణతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

