మెదక్‌లో కాగడాల ప్రదర్శన సిగ్గుచేటు!
మెతుకుసీమకు ద్రోహం చేసి సంబరాలా?
కేసీఆర్, హరీశ్‌రావులపై బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ ధ్వజం
మెదక్, అక్టోబర్ 10 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లాకు అన్యాయం చేసి, ఇప్పుడు జిల్లా ఆవిర్భావ దశాబ్ది పేరుతో కాగడాల ప్రదర్శన నిర్వహించడం సిగ్గుచేటని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన మెదక్ జిల్లాను కేసీఆర్ ఇచ్చిన బహుమతిగా ప్రచారం చేసుకోవడం ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు.
జిల్లా విస్తీర్ణం తగ్గించడంపై ప్రశ్నలు
సంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 4,464 చదరపు కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా విస్తీర్ణం 3,632 చదరపు కిలోమీటర్లు కాగా, మెదక్ జిల్లాను కేవలం 2,757 చదరపు కిలోమీటర్లకే ఎందుకు పరిమితం చేశారని హఫీజ్ ప్రశ్నించారు. జిల్లా హోదా కల్పించినట్లే కల్పించి, మెతుకుసీమ భౌగోళిక పరిధిని కుదించారని ఆరోపించారు.
కీలక కార్యాలయాలు సిద్దిపేటకు తరలించారని ఆరోపణ
మెదక్‌లో ఉండాల్సిన ఫారెస్ట్ కన్జర్వేటర్ కార్యాలయం, అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను సిద్దిపేటకు తరలించారని హఫీజ్ ఆరోపించారు. మెదక్‌కు మంజూరైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని సైతం సిద్దిపేటకు మళ్లించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలపై కేసీఆర్, హరీశ్‌రావులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మెదక్‌కు రావాల్సిన అభివృద్ధి అవకాశాలను దూరం చేసి, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించామని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నాగిరెడ్డిపేట ప్రజలు తమ ప్రాంతాన్ని మెదక్ జిల్లాలో కలపాలని పోరాటం చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.
ఉద్యమకారుల త్యాగాలను విస్మరించొద్దు
మెదక్ జిల్లా సాధన కోసం ఉద్యమకారులు రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారని, ఎన్నో కుటుంబాలు ఉద్యమానికి అండగా నిలిచాయని హఫీజ్ గుర్తుచేశారు. వారి త్యాగాలను విస్మరించి, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ఘనతను ఒక్క నాయకుడికే ఆపాదించడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు.
మెదక్ ప్రజలకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పకుండా కాగడాలు పట్టుకుని ఊరేగితే గత పాలనలో తీసుకున్న నిర్ణయాలు మారిపోవని వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా ఎవరి భిక్ష కాదని, ప్రజల పోరాటాలు, కన్నీళ్లు, త్యాగాల ఫలితమని మహమ్మద్ హఫీజ్ స్పష్టం చేశారు.
