కొల్చారం, అక్టోబర్ 11 (తెలుగు ట్రేండ్స్ )
కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్ సొసైటీలో రూ.8 లక్షల 18 వేల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై ఆదివారం సొసైటీ పాలకవర్గ సభ్యులు మహాజన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సొసైటీ నిధుల ఖర్చుకు సంబంధించిన తీర్మానాలు, రికార్డులను బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో సొసైటీ బీరువాను తెరిచి పరిశీలించగా, అందులో పలు రికార్డులు లభ్యమైనట్లు తెలిసింది. వాటిని పరిశీలించగా సొసైటీకి అవసరమైన ఫర్నిచర్, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్ తదితర వస్తువులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను సమర్పించి, వాటిని ఆడిట్ చేయించడం ద్వారా నిధుల ఖర్చుపై స్పష్టత తీసుకురావాలని మహాజన సభలో తీర్మానించారు. నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలు, లెక్కలు పారదర్శకంగా వెల్లడించాలని సభలో నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్రెడ్డి, సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, సీఈఓ సత్యనారాయణరెడ్డి, మాజీ చైర్మన్ రంగారెడ్డి, నరేందర్రెడ్డి, కిషన్రెడ్డి, పుల్లబోయిన మల్లేశం, శంకర్, సత్యం తదితరులు, రైతులు పాల్గొన్నారు.


