అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం
సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
మనోహరాబాద్, అక్టోబర్ 3 (తెలుగు ట్రెండ్స్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందిని ‘సేవా సంకల్ప అభియాన్’ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను శాలువాలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఎండ, వానను లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేస్తున్న వారి కృషి అభినందనీయమన్నారు. సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సన్మానించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ మాట్లాడుతూ.. సమాజ సేవలో ముందుండే వ్యక్తులు, సిబ్బంది, కార్యకర్తలను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలను గుర్తించడం తమకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నా
రు.

