అమిత్ షా పర్యటనకు భారీ బందోబస్తు
తూప్రాన్, అక్టోబర్ 3 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలో ఆదివారం అమూల్ పాల ఉత్పత్తి సంస్థ చేపట్టనున్న నిర్మాణానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేయనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనను దృష్టిలో ఉంచుకుని సుమారు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలి, హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇప్పటికే సెంట్రల్ కమాండో బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణం, హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాంతం పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పర్యటనకు వచ్చే ప్రముఖులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సభా ప్రాంగణం వద్ద భద్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


