రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే తిరుగుబాటే: ప్రేమ్ కుమార్ యాదవ్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
నర్సాపూర్, అక్టోబర్ 1 (తెలుగు ట్రెండ్స్): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో నర్సాపూర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల్లో శ్రీరాముడు, శివుడి ఆరాధనకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వివాదానికి దారితీసింది. బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నర్సాపూర్ పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని అన్నారు. దేవుళ్లను ప్రాంతాల వారీగా విభజించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో వాటిపై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని, ఆ పరమశివుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజల సందర్భంగా ప్రార్థించినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని ప్రేమ్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు వివరణ ఇస్తూ, ఆయన వ్యాఖ్యలు బీజేపీ రాజకీయాల్లో శ్రీరాముడి ప్రతీకను ఉపయోగించడంపై చేసిన విమర్శల సందర్భంలో ఉన్నాయని పేర్కొన్నా
యి.
