తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణలో శ్వేత విప్లవానికి నాంది
రూ.400 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక డెయిరీ ప్లాంట్.. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మహిళలు, యువతకు ఉపాధి.. పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యం
తూప్రాన్, అక్టోబర్ 4 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చేందుకు తూప్రాన్‌లో ఏర్పాటు చేయనున్న అమూల్ అత్యాధునిక డెయిరీ ప్లాంట్ కీలకంగా మారనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌లో సుమారు రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న అమూల్ డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ ప్లాంట్ ఏర్పాటుతో తెలంగాణలో శ్వేత విప్లవానికి నాంది పలుకుతుందని అన్నారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతుల ఆర్థిక అభ్యున్నతికి మరింత బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణలో శ్వేత విప్లవం 2.0ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తూప్రాన్‌లో ఏర్పాటు కానున్న ఈ డెయిరీ ప్లాంట్ కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టుగా కాకుండా తెలంగాణ పాడి రైతుల ఆర్థిక భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. రాబోయే 18 నెలల్లో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్థానిక మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పాడి రైతులకు పాల ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వివరించారు.
పాల ఉత్పత్తులకు విలువ జోడించడమే లక్ష్యం: రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌లో ఏర్పాటు కానున్న డెయిరీ ప్లాంట్ ద్వారా పరిసర ప్రాంతాల పాడి రైతుల నుంచి పాలను సేకరించి స్థానికంగానే ప్రాసెసింగ్ చేయనున్నట్లు తెలిపారు. పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, ఐస్‌క్రీమ్, నెయ్యి తదితర విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పాలకు అదనపు విలువను జోడించవచ్చని అన్నారు. దీనివల్ల రైతులకు పాలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉండటంతోపాటు స్థానికంగా రవాణా, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, విక్రయ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటలతో పాటు పాడి పరిశ్రమను కూడా ఆదాయ వనరుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
పాడి పరిశ్రమ చిన్న, సన్నకారు రైతులకు అండ: వ్యవసాయం అంటే కేవలం వరి, పత్తి, మిర్చి వంటి పంటలు సాగు చేయడమే కాదని కిషన్‌రెడ్డి అన్నారు. భూమి ఉన్నా లేకపోయినా పశుపోషణ ద్వారా కుటుంబానికి స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు పాడి పరిశ్రమ అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకవైపు వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే మరోవైపు పశుపోషణ చేపట్టడం ద్వారా రోజువారీ కుటుంబ అవసరాలకు ఆదాయం సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.
సహకార వ్యవస్థతో దళారుల దోపిడీకి అడ్డుకట్ట: రైతులు వ్యక్తిగతంగా కాకుండా సహకార సంఘాలుగా ఏర్పడి సమష్టిగా పనిచేస్తే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో కొన్ని చోట్ల అవి బలహీనపడ్డాయని, వాటిని తిరిగి పునరుద్ధరించి రైతుల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులే సహకార వ్యవస్థలో భాగస్వాములైతే దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడటంతోపాటు అవినీతి, మధ్యవర్తిత్వం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. సహకార సంఘాల ద్వారా వచ్చే ఆదాయం గ్రామాల్లోనే తిరిగి వినియోగమైతే స్థానికంగా ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని వివరించారు. సహకార ఉద్యమం కేవలం వ్యాపార నమూనా కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రజా ఉద్యమమని అన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో సహకార రంగం సాధించిన ప్రగతిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోనూ సహకార వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
సాబర్ డెయిరీ విజయమే నిదర్శనం: సహకార వ్యవస్థ ద్వారా రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో సాబర్ డెయిరీ ప్రయాణం నిదర్శనమని కిషన్‌రెడ్డి తెలిపారు. 1964లో 19 సహకార సంఘాలతో రోజుకు 5,100 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన సాబర్ డెయిరీ ప్రస్తుతం రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ స్థాయికి చేరుకుందని వివరించారు. సుమారు 50 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఈ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నారని, 2025-26లో రూ.10,500 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని తెలిపారు. అమూల్ సహకార నెట్వర్క్ ద్వారా పశువుల దాణా, పశువైద్య సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా అమూల్ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ ఉండటంతో పాటు పలు దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమూల్ సాధిస్తున్న గుర్తింపు భారత పాడి రైతుల సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు.
దేశవ్యాప్తంగా శ్వేత విప్లవం 2.0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార శాఖను ఏర్పాటు చేసి సహకార రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ 1,525 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలు, పాడి రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి పశుపోషణను విస్తరించాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా లభించే రుణాలను సద్వినియోగం చేసుకుని పశువులను కొనుగోలు చేయడం, పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.
రైతు బలపడితే దేశం బలపడుతుంది: ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని కిషన్‌రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో సహకార రంగం కీలక స్తంభంగా నిలవాలన్నదే లక్ష్యమన్నారు. శ్వేత విప్లవం 2.0 ద్వారా రైతులకు అదనపు ఆదాయం, యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన, గ్రామాలకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పాడి రైతులు సహకార ఉద్యమంలో భాగస్వాములై రాష్ట్రాన్ని శ్వేత విప్లవంలో ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు. రైతు బలపడితే గ్రామం బలపడుతుందని, గ్రామం బలపడితే తెలంగాణతో పాటు దేశం బలపడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన పాలు అందించే అవకాశం: మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తూప్రాన్‌లో ఏర్పాటు కానున్న డెయిరీ ప్లాంట్ ద్వారా సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పాలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి నాణ్యమైన పాలను బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. మెట్రో తదితర కార్యక్రమాలకు కేంద్రం నుంచి శాఖాపరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ రంగం వెన్నెముక: ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు డెయిరీ రంగం వెన్నెముకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. తూప్రాన్‌లో ఏర్పాటు కానున్న అమూల్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు గ్రామీణ రైతుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మెతుకు సీమ రైతులకు అదనపు ఆదాయం: మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అదనపు ఆదాయ మార్గాలను కల్పించాలనే ఉద్దేశంతో అమూల్ ప్రతినిధులను సంప్రదించినట్లు తెలిపారు. తాను పుట్టిన గడ్డలో రైతులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అండగా నిలవాలనే దృఢ సంకల్పంతో అమూల్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఎవరు ఆకలితో వచ్చినా వారి ఆకలి తీర్చే మెతుకు సీమ మెదక్ అని అన్నారు. మెదక్ జిల్లాలో రైతులు బాగుండాలని, వారికి అదనపు ఆదాయం చేకూరాలని అమూల్ పరిశ్రమను తూప్రాన్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరుల సహకారం ఎంతో ఉందన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను మెదక్ జిల్లాలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో తూప్రాన్‌లో అమూల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం చేస్తున్న రైతులు తమ రోజువారీ అవసరాలకు అదనపు ఆదాయం కోసం పాడి పరిశ్రమను ఆశ్రయిస్తే ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు.
కార్యక్రమంలో సాబర్ డెయిరీ చైర్మన్ శ్యామ్‌లాల్ జి. పటేల్, కోఆపరేటివ్ కమిషనర్ రాహుల్‌రాజ్, జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, అమూల్ ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.


