Type Here to Get Search Results !

తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో రైతుల కరెంటు కోసం బీఆర్ఎస్ రాస్తారోకో 12 గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌

 




రైతుల కరెంటు కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్

12 గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాల్సిందే.. లేకుంటే ఉద్యమం ఉధృతం

నిజాంపేట సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో 

తెలుగు ట్రెండ్స్, నిజాంపేట: రైతులకు కనీసం 12 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిజాంపేటలో రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్‌ మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.

రేయింబవళ్లు కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ కోతలు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువుల సరఫరా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల విద్యుత్‌ సమస్యను పరిష్కరించి కనీసం 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. హామీ మేరకు విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరో రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏఈ హామీతో ధర్నా విరమణ

బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఈ ఆదయ్య సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితో ఆయన చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఈ హామీ ఇవ్వడంతో నాయకులు, కార్యకర్తలు ధర్నాను విరమించారు.

కార్యక్రమంలో రైతులు, మండలంలోని సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, బీఆర్ఎస్‌ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language