మెదక్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
పర్యాటక ప్రాంతాలకు తుది మెరుగులు.. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
పర్యాటక ప్రాంతాల ప్రమోషన్లో సోషల్ మీడియా యూజర్లు భాగస్వాములు కావాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.
శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా టూరిజం రెండో విడత అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ అధికారులు గూగుల్ మీట్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన మొదటి విడత టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సలహాలు, సూచనలతో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహాయ సహకారాలు, కేంద్ర నిధుల మంజూరులో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక శ్రద్ధతో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో గుర్తించిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన తుది మెరుగులు చేపట్టి పర్యాటక శోభ ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యాటకులు బస చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో హోమ్స్టేలు ఏర్పాటు చేసే అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు.
ప్రధాన పర్యాటక ప్రాంతాలతో పాటు మెట్లబావి, వెల్దుర్తి తోరణం వంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేందుకు టూరిస్ట్ గైడ్లు, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
మెదక్ ఫోర్ట్ వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి సౌకర్యంగా ఉండేలా టికెటింగ్ సిస్టమ్ను ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రమోట్ చేసేలా సోషల్ మీడియా యూజర్లు కూడా భాగస్వాములు కావాలని కోరారు. మెదక్ ఫోర్ట్ టూరిజం అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులను సంప్రదించాలని అధికారులను ఆదేశించారు.
మెదక్ జిల్లా అధికారిక పర్యాటక వివరాల ప్రకారం మెదక్ ఫోర్ట్, మెదక్ కేథడ్రల్, ఏడుపాయల, పోచారం రిజర్వాయర్, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ప్రాంతాలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.
ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి గూగుల్ మీట్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ టూరిజం రంజిత్ నాయక్, డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ అర్జున్ రావు, టూరిజం కార్పొరేషన్ రామకృష్ణ, టూరిజం కార్పొరేషన్ డీఈ శ్రీశైలం, డెక్కన్ టెరైన్ ప్రైవేట్ కన్సల్టెన్సీ మీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే టూరిజం అభివృద్ధి అధికారి జెడ్పీసీఓ ఎల్లయ్య, డీఎఫ్ఓ జోజి, డీపీఆర్ఓ రామచంద్ర రాజు, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, ఈడీఎం సందీప్, మున్సిపల్ కమిషనర్ నవీన్ తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

