పాపన్నపేట పశువైద్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
రికార్డులు పరిశీలించిన జిల్లా పశువైద్యాధికారి ఆదిత్య వర్మ
పాపన్నపేట, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): పాపన్నపేట మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని జిల్లా పశువైద్యాధికారి టి. ఆదిత్య వర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పశువైద్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, పశుపోషకులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మండల పశువైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పశువైద్య సేవలను సమర్థవంతంగా అందించడంతో పాటు పశువులకు టీకాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పశువైద్య శిబిరాల నిర్వహణ, కృత్రిమ గర్భధారణ కార్యక్రమం, వాటి ఆన్లైన్ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు అర్హులైన పశుపోషకులకు చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సూచించారు. పశువులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ, రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మండల పశువైద్యాధికారులు డాక్టర్ సౌమ్యారెడ్డి, డాక్టర్ ప్రవీణ్కుమార్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సతీష్కుమార్, శివాజీ, ఎల్ఎస్ఏలు సురేష్, రాకేష్, సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
