మనోహరాబాద్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ.. రికార్డులు, ఫార్మసీ పరిశీలన
మనోహరాబాద్, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్): మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) గణేశ్వర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జైశ్రీ కూడా తనిఖీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ ఆరోగ్య కేంద్రంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసి మందుల నిల్వలు, పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సిబ్బందితో మాట్లాడిన డీఎంహెచ్ఓ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీలో వైద్యులు జోష్ణదేవి, సమత, సీహెచ్ఓ బాల నరసయ్య, శారద, హేమలత, కృష్ణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
