గిరిజనులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి.. గిరిజనులతో సమావేశంలో డిమాండ్
నర్సాపూర్, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. హైదరాబాద్లో సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీం ఆదివాసీ భవన్లను నిర్మించడంతో పాటు గిరిజనుల కోసం సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు, రూ.25 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
తండాలకు విద్యుత్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటింటికీ తాగునీరు అందించామని ఆమె తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తండాల్లో జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు గుర్తు చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. గిరిజనులకు రాజకీయంగా కూడా తగిన అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు.
గిరిజన కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని సునీత లక్ష్మారెడ్డి కోరారు. ఎరుకల సంఘానికి కేటాయించిన భూమిని అప్పగించడంలో అధికారులు ఇబ్బందులు కల్పిస్తున్నారని, వెంటనే ఆ భూమిని వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కంపెనీలలో ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని అన్నారు.
గిరిజన విద్యార్థుల చదువుల కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు దానిని విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు. తరతరాలుగా అడవుల్లో జీవిస్తూ విద్య, ఉపాధికి దూరంగా ఉన్న గిరిజనులకు మెరుగైన విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, శివంపేట మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాబ్యానాయక్తో పాటు పలువురు గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
