హకింపేట డ్యాం వద్ద జూదం ముఠా అరెస్ట్
రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం
వెల్దుర్తి, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
వెల్దుర్తి మండల పరిధిలోని హకింపేట గ్రామ సమీపంలో గల హకింపేట డ్యాం వద్ద జూదం ఆడుతున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు హకింపేట డ్యాం వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మాబుర్రుసు ఆడుతూ జూదానికి పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్రెడ్డి, గాండ్ల రాజు ఉన్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో జూదం, బొమ్మాబుర్రుసు, బెట్టింగ్ తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూదం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. యువతతో పాటు ప్రజలు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా జూదం, బెట్టింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
