కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
– జోగిపేట చేనేత సహకార సంఘ పాలకవర్గ సభ్యులు
తెలుగు ట్రెండ్స్, అందోలు ప్రతినిధి:
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం, చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని జోగిపేట చేనేత సహకార సంఘ పాలకవర్గ సభ్యులు కొనియాడారు. ఆయన ఆశయాలు, సేవలను భావితరాలకు అందించేలా ప్రతి ఏటా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం జోగిపేట పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పాలకవర్గ సభ్యులు, నేతన్నలు, పద్మశాలి కులస్తులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, తెలంగాణ కోసం సాగించిన ఉద్యమం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
పద్మశాలి కుల అభ్యున్నతికి, చేనేత రంగ అభివృద్ధికి బాపూజీ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు. యువత బాపూజీ జీవిత చరిత్రను, ఆయన పోరాట స్ఫూర్తిని తెలుసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాపూజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయన సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా పరిచయం చేయడంతో పాటు, చేనేత రంగం పట్ల అవగాహన పెంచేందుకు అవకాశం ఉంటుందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ పాలకవర్గ సభ్యులు పడిగే సత్యం, అనంత రాజ్, చిట్యాల మధు, మెట్టు రమేష్, గొంగ కృష్ణ, బండారు లక్ష్మి, మంత్రి ఇందిరా, పద్మశాలి కులస్తులు కోషికే సత్యం, పులగం శ్రీనివాస్, లక్ష్మణ్, పెద్దశాలి రాజేందర్, వెంకట నర్సింగ్ రమేష్, చేనేత కార్మికులు ఏశాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
