దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి: ఎంపీ రఘునందన్ రావు
మెదక్, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రెండ్స్): దివ్యాంగులు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు సహాయ పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రధాని మోదీ గత 25 సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగులు సమాజంలో ఎవరికీ తీసిపోరని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
గత ఆరు నెలలుగా జిల్లాలో 461 మంది దివ్యాంగులను గుర్తించి, వారికి సుమారు 850 సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ వివరించారు. ఇందులో భాగంగా పాపన్నపేట మండల కేంద్రానికి రెండు, కుర్తివాడ గ్రామానికి ఒకటి, కొడపాక గ్రామానికి ఒక ట్రైసైకిల్ను అందజేశారు.
ఇటీవల జరిగిన దివ్యాంగుల క్రీడల్లో భారత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో ప్రతిభ కనబరిచి నాలుగో స్థానం సాధించారని, 39 పతకాలను దేశానికి తీసుకువచ్చారని ఎంపీ పేర్కొన్నారు. దివ్యాంగులు తమలోని ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు.
దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రఘునందన్ రావు తెలిపారు. దివ్యాంగులకు అనుకూలంగా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే ఇలాంటి సహాయ పరికరాల పంపిణీ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, మెదక్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి, నాయిని ప్రసాద్తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


