విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా నిలవాలి.. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలి
కొల్చారం, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, సెలవు దినంగా ప్రకటించాలని విశ్వబ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరారు. విశ్వకర్మల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కొల్చారం మండల కేంద్రంలోని స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ భగవానుడిని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడికి భారతీయ సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానం ఉందన్నారు. సృష్టి నిర్మాణానికి అవసరమైన వివిధ పనిముట్లతో పాటు దేవతల నగరాలు, ద్వారక, హస్తినాపురం, స్వర్ణలోకం, మాయాసభ, ఇంద్ర భవనం వంటి నిర్మాణాలను విశ్వకర్మ భగవానుడు రూపొందించినట్లు పురాణాల్లో ప్రస్తావించబడిందని తెలిపారు.
ఇంతటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించి విశ్వకర్మల గౌరవాన్ని మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్థికంగా ఆదుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది విశ్వకర్మలు తమ సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని నాయకులు తెలిపారు. ఆధునిక పరిస్థితుల్లో వృత్తులకు తగిన ఆదాయం లేకపోవడంతో పలువురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేసి విశ్వకర్మలకు ఉపాధి, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి విశ్వకర్మకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వృద్ధాప్యంలో వృత్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పెన్షన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. విశ్వకర్మల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల ప్రభాకర్ చారి, గ్రామ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, దుర్గపతి చారి, పాండురంగాచారి, సిద్ధయ్య చారి, నరసింహ చారి, వీరస్వామి చారి, శ్రీనివాస్ చారి, శివకుమార్ చారి, కరుణాకరాచారి, శ్రవణ్ చారి, విశ్వేశ్వర్ చారితో పాటు విశ్వబ్రాహ్మణులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
