విద్యార్థుల సంక్షేమానికి మరో అడుగు.. ఇంటర్ విద్యార్థులకు ‘అల్పాహార’ భరోసా!
అల్పాహారంతో ఆరోగ్యం.. చదువుతో భవిష్యత్తు.. వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పథకానికి శ్రీకారం
వెల్దుర్తి, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటర్మీడియట్ విద్యార్థుల అల్పాహార పథకం వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైంది. ఇక నుంచి కళాశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం ఉచితంగా అల్పాహారం అందించనున్నారు.
హరే కృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం సరఫరా చేయనున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులకు అందుతున్న అల్పాహార సదుపాయంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకం అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారం విద్యార్థుల దైనందిన విద్యాభ్యాసానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
అడ్మిషన్లకు మరో అవకాశం
ఇంటర్మీడియట్లో ఇప్పటివరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులకు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 26, 2026 వరకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. వెల్దుర్తి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.
కళాశాలలో విద్యాభ్యాసంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి అందుబాటులోకి వస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు పి. మధన్మోహన్, శ్రీనివాస్, మాలతీదేవి, రేణుక, బాలకృష్ణ, నాన్టీచింగ్ సిబ్బంది స్నేహ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

