తూప్రాన్‌లో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ రజిని రవీందర్ గౌడ్
తూప్రాన్, సెప్టెంబర్ 17 (తెలుగు ట్రేండ్స్):
వనమహోత్సవం–2026 కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అల్లాపూర్‌లో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ రజిని రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో కీలకమని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. కేవలం మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తూప్రాన్‌ను మరింత పచ్చదనంతో నిండిన హరిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో వీలైనన్ని మొక్కలు నాటి వాటిని క్రమం తప్పకుండా సంరక్షించాలని చైర్మన్ కోరారు. పచ్చదనం పెరిగితే స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అల్లాపూర్‌లో పలు రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణపై మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించేలా, వాటిని జంతువుల నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ మన్నె స్వామి, కౌన్సిలర్లు సత్య లింగం, చెలిమెల రాములుతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు కూడా వనమహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని
వారు కోరారు.

