రామాయంపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
రామాయంపేట, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో రామాయంపేట సమగ్ర అభివృద్ధిని పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గంతో పాటు రామాయంపేట అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ అంశంపై గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ ప్రజలు, యువత ఎన్నో సంవత్సరాలుగా డివిజన్ కోసం పోరాటాలు, ధర్నాలు చేసినప్పటికీ తగిన స్థాయిలో స్పందించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా అధికారిక వెబ్సైట్లో రామాయంపేట మండలం మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నట్లు నమోదై ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, నాయకుడు మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రామాయంపేట బైపాస్ రోడ్డు పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌కు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపామని, త్వరలోనే సాధిస్తామని నాయకులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధిపై స్థానిక వ్యాపారులు, యువకుల సమక్షంలో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, పుట్టి సందీప్, రమేష్‌రెడ్డి, దాకి స్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు దేమే యాదగిరి, చింతల యాదగిరి, మహమ్మద్ గౌస్, మొబిన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైరం శంకర్, పిట్ల ప్రకాష్, సరాఫ్ యాదగిరి, చిలుక స్వామి, చిలుక విరాట్, సుధీర్, పోచమ్మల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
