Type Here to Get Search Results !

మండల సమీక్షలో అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు.. విద్యుత్ సమస్యలపై సర్పంచుల ఫైర్‌

 



మండల సమీక్షలో అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు

విద్యుత్ సమస్యలపై సర్పంచుల ఫైర్‌.. స్పందన లేదంటూ విద్యుత్ శాఖ అధికారిపై ఆగ్రహం
10,322 కొత్త రేషన్ కార్డులు అందజేశాం: తహసీల్దార్ విజయలక్ష్మి

వెల్దుర్తి, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా సంబంధిత అధికారులు సకాలంలో స్పందించడం లేదంటూ వెల్దుర్తి మండల సర్పంచులు మండలస్థాయి సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం స్పెషల్ ఆఫీసర్ రాకేశ్ అధ్యక్షతన మండలస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విగ్నేశ్వర్‌తో పాటు పలువురు సర్పంచులు, అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శెట్టిపల్లి కలాన్ గ్రామ సర్పంచ్ పడిగే శేఖర్ తమ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ తీగలు నేలపై పడిపోయినా సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వెంటనే స్పందించలేదని తెలిపారు. దీంతో గ్రామస్తులు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో తూప్రాన్ డివిజన్ విద్యుత్ డీఈ స్పందించి చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు.

అనంతరం పలువురు సర్పంచులు కూడా తమ గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు చేసినా సంబంధిత విద్యుత్ శాఖ అధికారి పెంట్యా నాయక్ సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. విద్యుత్ స్తంభాల మంజూరు, తెగిపోయిన విద్యుత్ తీగల మరమ్మతులు తదితర సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విద్యుత్ సమస్యల విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తే ఎలా అని సర్పంచులు ప్రశ్నించారు. వెల్దుర్తి మండలంలోని విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై సకాలంలో స్పందించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

10,322 కొత్త రేషన్ కార్డులు

సమావేశంలో తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 10,322 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంకా రేషన్ కార్డు లేని అర్హులు తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

స్పెషల్ ఆఫీసర్ రాకేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారులు సమన్వయంతో సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language