మట్టితో గణపతులను తయారు చేసిన విద్యార్థులు
పర్యావరణహిత వినాయక చవితిపై అవగాహన.. ఉత్తమ ప్రతిమలకు బహుమతులు
కొల్చారం, సెప్టెంబర్ 11 (తెలుగు ట్రెండ్స్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులు స్వయంగా మట్టితో గణపతి విగ్రహాలను తయారు చేసి ఆకట్టుకున్నారు.
విద్యార్థులు తమ సృజనాత్మకతను ఉపయోగించి వివిధ ఆకృతుల్లో మట్టి గణపతి ప్రతిమలను రూపొందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణహిత మట్టి గణపతులను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతిని కాపాడేందుకు దోహదపడుతుందని తెలిపారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు మట్టి గణపతి విగ్రహాల తయారీలో ప్రత్యేకంగా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రతిమల్లో ఉత్తమంగా రూపొందించిన విగ్రహాలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, ప్రియాంక, దివ్య, జ్యోతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.


