Type Here to Get Search Results !

హామీలు అమలు చేయండి.. మహిళల గోడు వినండి! వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం


 వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీలు ఎక్కడ?


మహిళలకు రూ.2,500 భృతి.. తులం బంగారం.. ఉచిత స్కూటీలు ఏమయ్యాయి?


కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. మోసపూరిత పాలన: మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి


మెదక్: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు శనివారం పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు నిరసన చేపట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, బంజారా మహిళలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ, కోలాటంలో పాల్గొంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.


మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?


ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. అలాగే వృద్ధులు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని పద్మా దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా మారిందని, విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.


ప్రకటనలు ఎక్కువ.. అభివృద్ధి తక్కువ


మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటినా అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని అన్నారు.


మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, పింఛన్ల పెంపు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.


ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, హామీల అమలు కోసం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్లు అరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్‌, కౌన్సిలర్‌ మామిడ్ల ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు చౌదరి సుబ్రబాత్‌రావు, మున్సిపల్‌ కౌన్సిలర్లు అనీస్‌ ఫాతిమా, జుబెర్‌ అహ్మద్‌, దీపక్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, సోహెల్‌, మాజీ కౌన్సిలర్లు అంకం చంద్రకళ, మాయ మల్లేశం, ఆర్కే మల్లేశం, శంకరంపేట మాజీ జడ్పీటీసీ మాధవి రాజు, రామాయంపేట మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్‌ చౌదరి చరిత, మెదక్‌, హవేలిఘనపూర్‌, శంకరంపేట, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు అంజగౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మహిళా నాయకురాళ్లు ప్రభావతి, సుజాత, రాధా, లతతో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మ






హిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language