సమాజానికి దిక్సూచి.. ఉపాధ్యాయుడు!
పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిది: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 5 (తెలుగు ట్రెండ్స్):
సమాజానికి ఉపాధ్యాయుడు దిక్సూచిలా పనిచేస్తారని, విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు భావి భారత పౌరులుగా రూపొందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మెదక్ ఐడీఓసీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు కలెక్టర్ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితంపై అత్యంత ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. పిల్లలకు భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞానాన్ని అందించేది గురువేనని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు గురువులే మార్గదర్శకులు
విద్యా రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సమాంతరంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మార్గనిర్దేశం వల్లే తాను సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమయ్యానని కలెక్టర్ ప్రతిమా సింగ్ గుర్తుచేశారు. తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో దోహదపడిందని తెలిపారు. ఉపాధ్యాయుల అంకితభావంతోనే విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించగలరని అన్నారు.
మెదక్ జిల్లాలోని ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో పనిచేసి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని, జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో మెదక్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
విద్యారంగంలో కొత్త శకం
తెలంగాణలో విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతోందని కలెక్టర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారని తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా వారిలో మరింత స్ఫూర్తిని నింపడంతో పాటు విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శాలువాలు, మెమెంటోలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు తదితరులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఏ.డి. శ్రీనివాసరావు, సీఎంఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, ఏఎస్‌ఓ నవీన్, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

