13వ వార్డులో తాగునీటి కష్టాలు.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ఎన్నిరోజులైనా సమస్య పరిష్కారం కాలేదంటూ ఆవేదన.. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్
నార్సింగి: నార్సింగి గ్రామంలోని 13వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లా కనెక్షన్లు ఉన్నప్పటికీ సక్రమంగా నీరు రావడం లేదని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
కొంతకాలంగా తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు నిత్యం నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
సమస్యను పలుమార్లు సంబంధిత పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోయారు. దీంతో తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు.
13వ వార్డు నుంచే ఉప సర్పంచ్‌గా ఎన్నం రాజేందర్‌రెడ్డి ఎన్నికయ్యారని, ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని స్థానికులు గుర్తుచేశారు. ప్రస్తుతం తమ వార్డులో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని కొందరు మహిళలు ఆరోపించారు.
ఈ సందర్భంగా కందరి లక్ష్మి మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు సమస్యను చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 13వ వార్డుకు సక్రమంగా తాగునీటి సరఫరా చేయాలని కోరారు.
తాగునీరు ప్రతి కుటుంబానికి అత్యవసరమైన అవసరమని, సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అన్నారు. హామీలతో కాలయాపన చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి 13వ వార్డులో తాగునీటి సరఫరాను సక్రమంగా పునరుద్ధరిస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
