కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు వినూత్న ప్రయత్నం..!
ఎలుగుబంటి వేషధారణతో గ్రామంలో పర్యటన
అప్పాజీపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
కొల్చారం, ఆగస్టు 30 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
కొతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న అప్పాజీపల్లి గ్రామ ప్రజలకు ఊరట కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న ప్రయత్నం చేపట్టారు. కోతులను గ్రామం నుంచి తరిమేందుకు ఎలుగుబంటి వేషధారణలో ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి గ్రామంలోని వార్డులన్నింటిలో తిప్పుతూ కోతులను భయపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇళ్లలోకి కోతులు ప్రవేశించడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, చిన్నారులు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది.
సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలుగుబంటి వేషధారణలో ఉన్న వ్యక్తి గ్రామంలోని వివిధ వీధుల్లో తిరుగుతూ కోతులను తరిమే ప్రయత్నం చేశారు. సాధారణంగా కోతులు ఎలుగుబంటి వంటి జంతువులను చూసి భయపడతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రయోగించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం గ్రామంలో ఆసక్తిని కలిగించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ప్రతినిధులు మాట్లాడుతూ.. కోతుల బెడద వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తగ్గేలా ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు సదాల నర్సింలు, కన్యబోయిన రామానుజన్, కాదూరి సుశీల, మానేపల్లి సావిత్రి పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల భాగయ్యతో పాటు సంఘ సభ్యులు రాజబోయిన జోగులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే గ్రామ యువకులు చింతల సురేందర్, అక్కమ్మ రాములు, కాదూరి కుమార్, తిమ్మకపల్లి సుధాకర్, తిమ్మకపల్లి ప్రభు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు నేరెళ్ల కృష్ణ, నేరెళ్ల శేకులు, పితిరి రవి, చింతల నరేందర్, రాజబోయిన సాయి, రాజబోయిన శ్రీకాంత్‌తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామంలో కోతుల బెడదను తగ్గించేందుకు చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నంపై గ్రామస్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులు కూడా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులందరికీ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
కొల్చారం రిపోర్టర్ ముత్తయ్య
