“ఏమమ్మా.. వ్యాపారం ఎలా ఉంది?”
మహిళ వ్యాపారితో ముచ్చటించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.. మొక్కజొన్న కంకులు
కొనుగోలు జోగిపేట , సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ ఆదివారం అందోల్, వట్పల్లి మండలాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వెల్కమ్ కమాన్ పనులను పరిశీలించిన మంత్రి.. అక్కడ సమీపంలో మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్న ఓ మహిళను చూసి ఆమెతో ఆప్యాయంగా ముచ్చటించారు.
“ఏమమ్మా.. వ్యాపారం ఎలా ఉంది? లాభాలు వస్తున్నాయా లేదా?” అంటూ మహిళను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. ఆమె వ్యాపారం ఎలా సాగుతుందో, ఆదాయం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ఆ మహిళ “వ్యాపారం బాగానే ఉంది సార్” అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం మంత్రి ఆమె వద్ద నుంచి మొక్కజొన్న కంకిని కొనుగోలు చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆమెకు భరోసా ఇచ్చారు. మంత్రి సాధారణంగా తనతో ముచ్చటించి, తన వ్యాపారం గురించి ఆరా తీయడంపై ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఆయన వెంట జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ శేరి జగన్ మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్, నాయకులు పెద్దపట్ల వినయ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
