హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు.. టూరిస్టులకు కొత్త అనుభూతి
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
హైదరాబాద్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు కొత్త ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ హాప్-ఆన్ హాప్-ఆఫ్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు కోరింది.
ఈ బస్సుల్లో పైభాగం ఓపెన్గా ఉండి నగరంలోని ప్రముఖ ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది. కింది అంతస్తులో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం ఉంటుంది. పర్యాటకుల కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, టూరిస్ట్ గైడ్ మైక్రోఫోన్, USB ఛార్జింగ్ పాయింట్లు, LED లైటింగ్ వంటి సదుపాయాలను కల్పించనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వద్ద ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. వాటిని పర్యాటక అవసరాలకు వినియోగించేందుకు టూరిజం శాఖ చర్యలు చేపడుతోంది.
నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్, గోల్కొండ, హైటెక్ సిటీ వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సేవలను అభివృద్ధి చేయనున్నారు.
తెలుగు ట్రెండ్స్ | హైదరాబాద్
