డిగ్రీ సీట్ల భర్తీకి మరో అవకాశం.. 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఇంకా ప్రవేశం పొందని విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23న కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ తదితర అర్హత కలిగిన డిగ్రీ కళాశాలల్లో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలను కళాశాలలు సెప్టెంబర్ 26న DOST పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం రూ.425 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు.
ఇక మిగిలిన ఖాళీల భర్తీ కోసం సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశాల్లో చేరిన విద్యార్థుల వివరాలను సెప్టెంబర్ 30న DOST వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు కళాశాల వారీగా ఖాళీ సీట్ల వివరాలు, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే పరిశీలించుకోవాలి.
తెలుగు ట్రెండ్స్ | ఎడ్యుకేషన్
