తొమ్మిది రోజుల భక్తి పూజలు.. నేడు గణనాథుడి నిమజ్జనం
రామాయంపేట, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సుప్రభాత్ రావు అపార్ట్మెంట్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న 30 కుటుంబాల ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.
తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతిని నిమజ్జనానికి తరలించేందుకు భక్తులు ఏర్పాట్లు చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో నిమజ్జన శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఉత్సవాల సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించిన అనంతరం గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.

