విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి
చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి: మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్
నర్సాపూర్, సెప్టెంబర్ 21 (తెలుగు ట్రెండ్స్):
విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ సూచించారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని గీత పాఠశాలలో నిర్వహించిన మొబైల్ ఫోన్ అవగాహన కార్యక్రమానికి వారు హాజరై విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు అందించే సూచనలు, సలహాలను పాటిస్తూ క్రమశిక్షణతో చదివి ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా పట్టణంలోని పలు గణేష్ మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
