వరంగల్ విమానాశ్రయానికి మహాగురు సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలి.. సీఎం రేవంత్రెడ్డికి శ్రీకాంత్ నాయక్ విజ్ఞప్తి
అందోలు, సెప్టెంబర్ 24 (తెలుగు ట్రెండ్స్): వరంగల్లో నిర్మాణం కానున్న విమానాశ్రయానికి బంజారా, గిరిజన సమాజాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు మహాగురు సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలని కొండాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు.
బంజారా సమాజానికి మహాగురు సేవాలాల్ మహారాజ్ అందించిన ఆధ్యాత్మిక, సామాజిక సేవలు చిరస్మరణీయమని శ్రీకాంత్ నాయక్ పేర్కొన్నారు. ఆయన పేరును వరంగల్ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా బంజారా, గిరిజన సమాజాల గౌరవాన్ని మరింత పెంచినట్లవుతుందని అన్నారు.
ఉత్తర తెలంగాణకు వరంగల్ విమానాశ్రయం కీలకమైన రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో, విమానాశ్రయానికి మహాగురు సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
మహాగురు సేవాలాల్ మహారాజ్ పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా బంజారా జాతి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం భవిష్యత్ తరాలకు చిరస్థాయిగా గుర్తుండేలా చేయవచ్చని శ్రీకాంత్ నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జైరాం నాయక్, నరేష్ నాయక్, దుర్గా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
