యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు
పాపన్నపేట, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో బుధవారం ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సౌజన్యంతో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీకే తునికి శాస్త్రవేత్త డా. ఎం. ఉదయ్ కుమార్ సేంద్రియ వ్యవసాయం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, జీవన ఎరువుల వినియోగం, రాబోయే యాసంగి సీజన్లో సాగు చేయాల్సిన పంటల గురించి రైతులకు వివరించారు. నానో యూరియా, నానో డీఏపీ, ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కర్బనం లభ్యత, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాపన్నపేట మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నూనెగింజలు, పప్పుదినుసుల పంటల సాగుపై రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఒక ఎకరం వరి సాగు చేసే భూమిలో రెండు, మూడు ఎకరాల ఆరుతడి పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చీకోడ్ చైర్మన్ సిద్ధంశెట్టి దత్త రాజు, సీఈఓ పి. ప్రశాంత్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట
