రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన.. మెదక్లో దిష్టిబొమ్మ దహనం
మెదక్, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల శ్రీరాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తమ ఆరాధ్య దైవాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. మతపరమైన అంశాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని, హిందువుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలను మతపరమైన అంశాలతో విభజించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మెదక్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, మెదక్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బజ్జూరి బిక్షపతి, జనరల్ సెక్రటరీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేన్రెడ్డి, సాయిగౌడ్, సాయిదీప్, జిల్లా నాయకులు లోకేష్, అల్లం మధు, రాహుల్, ఆమ్దం సాయి, సన్నీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్, మెదక్

