మెదక్ జేన్ రోడ్డులో వినాయక చవితి సందడి
పూజా సామగ్రి, వినాయక ప్రతిమల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్
మెదక్, సెప్టెంబర్ 13 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని జేన్ రోడ్డులో ఆదివారం పండుగ సందడి నెలకొంది. వినాయక ప్రతిమలు, పూజా సామగ్రి, నైవేద్యానికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్కు తరలిరావడంతో జేన్ రోడ్డు, పెద్దబజార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రజలు వివిధ రకాల ప్రతిమలను కొనుగోలు చేశారు. పూజా సామగ్రిలో భాగంగా పత్రి, మామిడి కొమ్మలు, తుమ్మి ఆకులు, పూలు, పూలమాలలు, అరటి ఆకులు, కొబ్బరికాయలు, పండ్లు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, గంధం, అక్షింతలు, కర్పూరం, అగరబత్తులు తదితర వస్తువులను కొనుగోలు చేశారు.
అదేవిధంగా నైవేద్యం కోసం బెల్లం, బియ్యప్పిండి, నువ్వులు, పండ్లు, స్వీట్లు తదితర సామగ్రిని ప్రజలు తీసుకెళ్లారు. వినాయక చవితి పూజలో ప్రత్యేకంగా ఉపయోగించే పత్రి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారులు వివిధ రకాల ఆకులు, కొమ్మలను తీసుకొచ్చి విక్రయించారు.
జేన్ రోడ్డు నుంచి పెద్దబజార్ వరకు పలు దుకాణాలు పూజా సామగ్రితో కళకళలాడగా, మాయా బేకిరి, రాందాస్ చౌరస్తా పరిసర ప్రాంతాలు, సమీప గ్రామాల నుంచి పత్రి, మామిడి కొమ్మలు, తుమ్మి ఆకులు తదితర సామగ్రిని తీసుకొచ్చి విక్రయాలు చేపట్టారు. దీంతో మార్కెట్లో సందడి మరింత పెరిగింది.
వినాయక చవితి సందర్భంగా ప్రజలు కుటుంబ సమేతంగా పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. పండుగకు కావాల్సిన వస్తువులన్నీ ఒకే ప్రాంతంలో లభిస్తుండటంతో పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా మార్కెట్కు తరలివచ్చారు. దీంతో మెదక్ పట్టణంలో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది.

