పట్టుబడిన పీడీఎస్ బియ్యం.. డీసీఎం సీజ్
పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద 143.10 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
కొల్చారం, సెప్టెంబర్ 10 (తెలుగు ట్రెండ్స్):
పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని కొల్చారం పోలీసులు పట్టుకున్నారు. పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఈ మేరకు డీసీఎం వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
కొల్చారం ఎస్సై మహమ్మద్ మొహీనుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో KA-32-AA-4947 నంబరు గల డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (FRK)తో కలిపి మొత్తం 290 బస్తాల పీడీఎస్ బియ్యం, 143.10 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ముజీబ్ను పోలీసులు విచారించగా, చంద్రాయణగుట్ట ప్రాంతంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, మెదక్ మీదుగా బోధన్కు తరలించి అక్కడ అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, డీసీఎం వాహనం తనవేనని డ్రైవర్ తెలిపినట్లు ఎస్సై వెల్లడించారు.
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్న వ్యవహారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, తెలంగాణ స్టేట్ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్–2016లోని క్లాజ్ 17(ఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా, అధికారులు నర్సాపూర్ మండలం లింగాపూర్లోని తిరుమల అగ్రో ఇండస్ట్రీస్లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. డీసీఎం వాహనాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొల్చారం పోలీస్స్టేషన్లో ఉంచినట్లు ఎస్సై మహమ్మద్ మొహీనుద్దీన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
