బీవీఆర్ఐటీలో విదేశీ విద్యా అవకాశాలపై అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్
నర్సాపూర్, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో జెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సహకారంతో అంతర్జాతీయ విద్యా పరస్పర సమావేశం మరియు యూనివర్సిటీ ఫెయిర్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నేరుగా కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఫెయిర్లో అమెరికా, బ్రిటన్కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలైన న్యూయార్క్ యూనివర్సిటీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, జార్జ్ మేసన్ యూనివర్సిటీ, కొలరాడో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ విద్యకు సంబంధించిన ప్రవేశ విధానాలు, స్కాలర్షిప్లు, పరిశోధనా అవకాశాలు, కెరీర్ మార్గాలు, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఫండింగ్, వీసా ప్రక్రియ వంటి అంశాలపై విద్యార్థులకు వివరణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా సంభాషించారు. ఈ కార్యక్రమాన్ని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, గ్రాడ్యుయేట్ స్టడీ అబ్రాడ్ సెంటర్ (జీఎస్ఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డీన్ డా. బంగారు రాజు, జీఎస్ఏసీ కో-ఆర్డినేటర్ కె. ప్రణీత ఫెయిర్ను సమన్వయం చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనగా, కళాశాల మేనేజర్ శ్రీ బి. బాపి రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ టి.ఎల్.ఎన్. సురేష్ పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది.

