నర్సాపూర్లో వినాయక ఉత్సవాలపై పీస్ మీటింగ్
పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
నర్సాపూర్, సెప్టెంబర్ 9 (తెలుగు ట్రెండ్స్): వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, పోలీసు శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీస్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్తో పాటు నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. మండపాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
మండపాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఊరేగింపులు, నిమజ్జనం వంటి అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని డీఎస్పీ తెలిపారు.
నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ
అనంతరం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రాయరావు చెరువును సందర్శించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు.
వినాయక ఉత్సవాలు సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్సైలు రంజిత్ కుమార్ రెడ్డి, జగన్నాథం, కౌన్సిలర్లు, వివిధ గ్రా
మాల సర్పంచులు, వినాయక మండపాల నిర్వాహకులు, ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.
