Type Here to Get Search Results !

మెదక్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం ఎప్పుడు? మౌలిక వసతులు, కోచ్‌ లేక యువ ప్రతిభకు అవకాశాలు కరువు

 

మెదక్ క్రికెట్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు?

ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్టులో మెదక్‌ ప్లేయర్లకు చోటేది?

మౌలిక వసతులు, కోచ్‌ లేక ప్రతిభ ఉన్నా అవకాశాలకు దూరం

ఓల్డ్‌ క్రికెట్‌ ప్లేయర్లు ముందుకు రావాలని మెదక్‌ ప్రజల ఆకాంక్ష

మెదక్, సెప్టెంబర్ 11:
ఒకప్పుడు క్రికెట్‌లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన మెదక్‌ ప్రాంతం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్‌లో వెనుకబడిపోతోందనే ఆవేదన క్రీడాభిమానులు, యువ క్రికెటర్లలో వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్లలో సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఎక్కువగా ఎంపికవుతుండగా, మెదక్‌ ప్రాంతానికి చెందిన క్రీడాకారులకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి ప్రధాన కారణాల్లో మెదక్‌లో సరైన క్రికెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేకపోవడం, శాశ్వత కోచ్‌ అందుబాటులో లేకపోవడం, క్రికెట్‌ అసోసియేషన్‌లో మెదక్‌ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ముఖ్యమైనవిగా క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన రాజేందర్‌రెడ్డి ఉన్నారు. సెలక్షన్‌ ప్రక్రియలో భాగంగా మెదక్‌లో కూడా ఎంపికలు నిర్వహించినప్పటికీ, మెదక్‌ నుంచి ఒక్క క్రీడాకారుడు కూడా ఎంపిక కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేవలం సెలక్షన్‌ నిర్వహించడం కాకుండా, స్థానికంగా ప్రతిభను గుర్తించి, వారికి నిరంతరం శిక్షణ అందించే వ్యవస్థ అవసరమని క్రీడాభిమానులు అంటున్నారు.

కోచ్‌ లేక ఇబ్బందులు

మెదక్‌లో క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి సరైన శిక్షణ అందించే కోచ్‌ లేకపోవడం వల్ల ప్రతిభ ఉన్న క్రీడాకారులు అవకాశాలను కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వేసవిలో క్రికెట్‌ శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ అవి నిరంతర ప్రక్రియగా కొనసాగకపోవడంతో యువ క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలగడం లేదని చెబుతున్నారు.

నాలుగు దశాబ్దాల క్రికెట్‌ చరిత్ర

మెదక్‌కు క్రికెట్‌లో సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 40 సంవత్సరాల క్రితం కూడా మెదక్‌లో మ్యాట్‌పై క్రికెట్‌ ఆడేవారు. అప్పట్లో చైతన్య టీం, పోసనేట్‌ (చర్చి కాంపౌండ్‌), యునైటెడ్‌, కొల్లిగడ్డ, దయరా, జ్యోతి క్లబ్‌, యునైటెడ్‌ రెబెల్స్‌, అజంపురా, వైశ్రాయ్‌, మాచవరం, కౌడిపల్లి, వెల్దుర్తి, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో క్రికెట్‌ జట్లు చురుగ్గా ఉండేవి.

ఈ జట్లలో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉండేవారని, అప్పట్లో మెదక్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉండేదని సీనియర్‌ క్రీడాభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. అయితే కాలక్రమేణా సరైన మౌలిక వసతులు, నిరంతర శిక్షణ, వ్యవస్థీకృత ప్రోత్సాహం లేకపోవడంతో మెదక్‌ క్రికెట్‌ వెనుకబడిందని వారు అభిప్రాయపడుతున్నారు.


మెదక్‌కు చెందిన మహేందర్‌రెడ్డి ప్రస్తుతం మెదక్‌లో క్రికెట్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మెదక్‌లో క్రికెట్‌కు మంచి వేదిక కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.

ఓల్డ్‌ ప్లేయర్లు ముందుకు రావాలి

మెదక్‌లో క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే గతంలో క్రికెట్‌ ఆడిన ఓల్డ్‌ ప్లేయర్లు కూడా మరోసారి ముందుకు రావాలని మెదక్‌ ప్రజలు కోరుతున్నారు. తమ అనుభవాన్ని నేటి యువ క్రీడాకారులకు అందిస్తూ, శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తే మెదక్‌ నుంచి మంచి క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు.

గతంలో మెదక్‌లో క్రికెట్‌ ఆడిన సీనియర్‌ క్రీడాకారులు, మాజీ జట్ల సభ్యులు కలిసి ఒక వేదికగా ఏర్పడి యువతకు మార్గదర్శకత్వం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పాత ఆటగాళ్ల అనుభవం, కొత్త తరం ఆటగాళ్ల ప్రతిభ కలిస్తే మెదక్‌ క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక వసతులు కల్పిస్తే ప్రతిభకు కొదవ లేదు

మెదక్‌లో శాశ్వత క్రికెట్‌ కోచ్‌, మెరుగైన క్రికెట్‌ గ్రౌండ్‌, నెట్స్‌, క్రీడా పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా సెలక్షన్‌లు, టోర్నమెంట్లు నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మెదక్‌కు చెందిన బెన్‌ జాన్సన్‌ హెచ్‌సీఏ అండర్‌-23 జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం కూడా మెదక్‌ క్రికెట్‌కు సానుకూల పరిణామంగా క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఆయన అనుభవంతో పాటు స్థానికంగా కృషి చేస్తున్న వారి సహకారం, ఓల్డ్‌ క్రికెట్‌ ప్లేయర్ల మార్గదర్శకత్వం కలిస్తే మెదక్‌లో క్రికెట్‌ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్‌లో మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు కల్పిస్తే ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులకు కొదవ లేదని.. వారికి సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, క్రికెట్‌ అసోసియేషన్‌, స్థానిక క్రీడాభిమానులపై ఉందని మెదక్‌ ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language